మేలుకొలుపులు
కాస్తో కూస్తో సంగీతం తెలిసిన వారికి భూపాలం అనగానే ఉషఃకాంతులూ, పక్షుల కిలకిల రవాలూ, మంచులో తడిసిన పూలూ, రాత్రంతా సేదతీరి బద్ధకంగా మేలుకుంటున్న ప్రకృతి, తెలతెలవారుతున్న తూరుపు ఆకాశం .. ఇవన్నీ గుర్తొస్తాయి. మరి ఆ తిరుమల స్వామిని నిద్ర లేపడానికి భూపాల రాగం పాడ్డంలో ఆశ్చర్య మేముంది?
|
భూపాలంలో స్వరపరిచిన అన్నమయ్య పదం, బాలమురళీకృష్ణ గాత్రంలో శ్రీవేంకటపతికి మేలుకొలుపు
భూపాలం, బౌళి (కొందరు భౌళి అంటారు), రేవగుప్తి .. ఈ మూడూ చాలా సన్నిహితంగా ఉండే రాగాలు. మూడూ బహు ప్రాచీనమైనవే. అనాదిగా ఉషఃకాలోచితమైన అనేక దైవ మానవ కార్యక్రమాలకి ఈ మూడు రాగాలూ నేపథ్యసంగీతాన్ని అందిస్తూ వచ్చాయి. మూడిటికీ మధ్య తేడాలు బహు స్వల్పం. ఎంత చిన్న తేడాలంటే, ఒకపాటి సంగీతం వచ్చిన వారు కూడా ఈ రాగాల్ని విన్నప్పుడు కొంచెం తికమక పడుతుంటారు.
భూపాలం ఆరోహణలోనూ, అవరోహణలోనూ అవే ఐదు స్వరాలను కలిగి ఉంది. ఇలాంటి రాగాల్ని ఔడవ రాగాలంటారు.
ఆరోహణ: స, రి1, గ1, ప, ద1
అవరోహణ: ద1, ప, గ1, రి1, స
72 మేళకర్త విభజన పద్ధతిలో దీన్ని 8వ మేళకర్త హనుమత్తోడి జన్యంగా భావిస్తారు.
దీన్నించి బౌళి రెండు విషయాల్లో విభేదిస్తుంది. గ1 కి బదులు గ2 ఉంటుంది ఆరోహణంలోనూ, అవరోహణంలోనూ. అది కాక, అవరోహణలో ని2 స్వరం అదనంగా వచ్చి చేరుతుంది. అంటే బౌళి స్వరక్రమం ఇలా ఉంటుంది.
ఆరోహణ: స, రి1, గ2, ప, ద1
అవరోహణ: ని2, ద1, ప, గ2, రి1, స
దీన్ని 15 వ మేళకర్త మాయామాళవగౌళ జన్యంగా పరిగణిస్తారు.
బౌళిలో శ్రీరామునికి మేలుకొలుపు, త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తన, గొంతు బాలమురళీకృష్ణ
|
బౌళిలో ప్రసిద్ధమైన అన్నమయ్య పదం, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం
బౌళిలో అవరోహణలో వచ్చే ని2 స్వరాన్ని తొలిగిస్తే అదే రేవగుప్తి. అంటే, ఈ తేడాని కనిపెట్టడానికి బహు సునిశితమైన వినికిడి ఉండాలన్నమాట. స్వరస్థానాలు మారకపోవడం వల్ల రేవగుప్తి కూడ మాయామాళవగౌళ జన్యమే.
రేవగుప్తిలో నేదునూరి వారు స్వరపరిచిన అన్నమాచార్యులవారి గొప్ప తాత్త్విక కీర్తన, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో
ట్రావంకూరు ఏలిక శ్రీ కులశేఖరమహారాజు (స్వాతి తిరునాళ్ గా ప్రసిద్ధులు) రచించిన అద్భుతమైన సంస్కృత కృతి, గోపాలదేవుని కీర్తిస్తూ, జేసుదాసు గళంలో
ఈ మూడు రాగాల్లోనూ ఒక ప్రత్యేకమైన తూగు ఉంటుంది. ఎందుకంటే, ఆరోహణలో ద1 నించి తారస్థాయి స కి వెళ్ళేప్పుడు, రెంటికీ మధ్య మూడు స్వరస్థానాలు ఖాళీగా ఉంటాయి. ఆ మధ్యలో స్వరాలేవీ ధ్వనించకుండా గొంతుని గంతు వేయించాలి. ఆలాగే అవరోహణలో కూడా (బౌళి అవరోహణలో ఈ ఖాళీ రెండు స్థానాలే, ని2 ఉంటుంది కాబట్టి). ఇదే విధంగా రి-గ ల మధ్య వచ్చే ఖాళీ, గ-ప ల మధ్య వచ్చే ఖాళీ కూడా ఈ రాగాల ప్రత్యేకతకి దోహదం చేస్తాయి.
స, రి, గ, ప, ద, స్వరస్థానాలు కలిగిన ఇంకొక ప్రఖ్యాత రాగం ఉంది. ఐతే అది ఈ మూడు రాగాల్లాగా ఉండదు. అంతే కాదు, కర్నాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలోనూ, ఇంకా అనేక ప్రపంచ దేశాల సంప్రదాయ సంగీతాల్లోనూ తనకొక ప్రత్యేకతని ఆపాదించుకున్న రాగం ఇది. అదే మోహన రాగం.
